Bheemadevarapally, Mulkanoor: పెచ్చులూడిపోతున్న ప్రభుత్వ పాఠశాల భవనం
భయాందోళనలో విద్యార్థులు

ప్రభుత్వాలు మారినా పాఠశాల దుస్థితి మాత్రం మారలేదని తల్లిదండ్రుల ఆవేదన
పెచ్చులూడిపోతున్న ప్రభుత్వ పాఠశాల భవనం
-భయాందోళనలో విద్యార్థులు
-ప్రభుత్వాలు మారినా పాఠశాల దుస్థితి మాత్రం మారలేదని తల్లిదండ్రుల ఆవేదన
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. పెచ్చులు ఊడిపడుతున్న శ్లాబ్, వర్షం వస్తే భవనం నీరు కారిపోతుంది , గోడలు నానిపోతున్నాయి. స్కూలు ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోతుంది. విద్యార్థుల భద్రతపై పెను ముప్పుగా మారాయి.
ప్రస్తుతం ఈ పాఠశాలలో 26 మంది విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. తలపై పైకప్పు ఉందా అనే అనుమానంతో తరగతులకే హాజరవుతున్నారు. మూడు గదుల పాఠశాల భవనం శ్లాబ్ నుంచి సిమెంట్ పొరలు ఊడిపడటంతో ఎప్పుడెప్పుడు ప్రమాదం జరిగేదోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు – మారని దుస్థితి:
పలుమార్లు ఉన్నతాధికారులు, అప్పుడు వున్నా ఐఏఎస్ లు ఆమ్రపాలి, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులు పాఠశాలను సందర్శించినప్పటికీ, ఏ చర్యలూ తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు నిరుత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా (బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు), పాఠశాల పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించలేదని వారు వాపోతున్నారు.
విలీన ఆదేశాలపై సందిగ్ధం:
ఇటీవల అధికారులు ఈ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేయాలని ఆదేశించగా, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. “అంత దూరంగా మా పిల్లలను పంపలేము. అవసరమైతే ప్రైవేట్ స్కూల్‌కి పంపుతాం, కానీ పిల్లల భద్రత మొదట,” అని వారు ధీటుగా చెప్పారు.
భయాందోళనలో విద్యార్థులు:
సగం పైపెచ్చులు కూలిపోయిన భవనం, ఎప్పుడూ తడిగా ఉండే తరగతి గదులు, నీటిసేకరణ సమస్యల మధ్య పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. విద్యాభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించే పాలకులు ముల్కనూర్ పాఠశాలపై మాత్రం కనీస దృష్టి పెట్టలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అధికారులు స్పందించాలి:
ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పిల్లల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే, ఇది కేవలం మౌలిక వసతుల లోపమే కాక, నిస్సహాయ చిన్నారుల భవిష్యత్తుపై నేరమవుతుంది.