Thukkuguda Meeting: కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Thukkuguda Meeting: కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Thukkuguda Congress Meeting: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడ లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై సంచల వ్యాఖ్యలు చేశారు. నేనేమీ జానారెడ్డిని కాదని నికార్సైన రేవంత్ రెడ్డి నని అది గుర్తుంచుకోవాలని అన్నారు. కెసిఆర్.. నిన్ను త్వరలోనే చర్లపల్లి జైలుకు పంపిస్తానని, జైలులో నీకోసం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి శాశ్వతంగా దాంట్లోనే ఉంచుతానని తెలిపారు. నీ జూటా మాటలు తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణకు చీడపురుగులా దాపురించావని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే మీ అవినీతి బండారాన్ని బయట పెడతామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుసుకుటే అంగీ, లాగు ఊడపీకి ఊరేగిస్తారని అన్నారు. తెలంగాణకు పది సంవత్సరాలు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బిడ్డ ఢిల్లీ జైలుకు పోయిందని, నీకు తొంటి విరిగిందని, నీ పార్టీ తెలంగాణలో అస్తవ్యస్తమైందని అన్నారు.
తెలంగాణ ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ఎన్ని రోజులు ఫామ్ హౌజ్ లలో పడుకొని, అధికారం కోల్పోయాక రైతులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. నీ పార్టీలో నలుగురు తప్ప వేరే వాళ్ళు ఎవరు మిగలరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని మా ప్రభుత్వం జోలికొస్తే ప్రజలందరూ అగ్ని కణాలై విజృంభిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నిధుల వరద పారుతుందని డబుల్ ఇంజన్ సర్కార్ లాగే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించేది లేదని అన్నారు. రాహుల్ గాంధీ కి తెలంగాణ పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
